Pachi Rotta Cultivation | పెద్దపల్లి, జూన్4: చేనుకు చేవ -రైతుకు అధిక లాభాలను ఇచ్చే పచ్చిరొట్ట ఎరువు పంటలు జీలుగ, జనుము, పిల్లి పెసర సాగు చేస్తే రసాయనిక ఎరువులను తగ్గించడంతోపాటు భూసారం పెరుగుతుందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. రైతులు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడుతూ పచ్చి రొట్టె ఎరువు పంటలు జీలుగ, జనుము, పిల్లి పెసర సాగు విస్మరిస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు తగ్గి, ఆశించిన దిగుబడులు సాధించాలంటే వరి సాగుకు ముందు జీలుగ విత్తనాలు సాగుచేసి, తరువాత భూమిలో కలియ దున్నితే భూసారం పెరగడంతో పాటు పంట దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
జీలుగ సాగు..
జీలుగ విత్తనాలు భూమిలో చల్లిన రోజు నుంచి 25 -30 రోజుల్లో ఏపుగా పెరుగుతుంది. ఎకరానికి 10 – 12 కిలోల విత్తనాలు అవసరం. దుక్కిలో 20 – 30 కిలోల యూరియా వేసి ఆపై విత్తనాలను చల్లుకోవాలి. మొక్కలు బాగా పెరిగేందుకు క్రమ పద్ధతిలో నీటి తడులు ఇవ్వాలి. 25 -30 రోజులకు మొక్క ఏపుగా పెరుగుతుంది, పూత దశకు చేరుకుంటుంది. ఆ సమయంలో మొక్కలను మొదల వద్ద కత్తిరించాలి లేదా రోటవేటర్ సహాయంతో కలియదున్నాలి. దున్నిన తర్వాత 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ దుక్కిలో వెయ్యాలి. సూపర్ ఫాస్పేట్ వల్ల మొక్కల అవశేషాలు బాగా కుళ్ళి పచ్చిరొట్ట ఎరువులు తయారవుతాయి.
జీలుగ పంట ప్రయోజనాలు:
.ప్రధాన పంటకు ముందస్తుగా నేలను తయారు చేస్తుంది.
.మొక్కలకు రెండు శాతం నత్రజని, బాస్వరం అదనంగా అందిస్తాయి.
.జింక్, మ్యాంగనీస్, ఇనుము, కాల్షియం వంటి సూక్ష్మధాతువులను పంటకు చేకూరుస్తాయి.
.నేలలో కరగని మూలకాలను పంటకు అనుకూలంగా మారుస్తాయి.
.నీటి నిల్వ సామర్థ్యం పెంచుతాయి.
.నేల సహజ మిత్రులైన వానపాముల ఉత్పత్తికి దోహదం చేస్తాయి.
.లెగ్యూమ్ జాతికి చెందిన మొక్క కావడంతో వేర్లలో నత్రజని స్థిరీకరణ అధికంగా ఉంటుంది.
.తుంగ, గరిక వంటి కలుపు మొక్కలను అడ్డుకుంటుంది.
. భూముల పునరుద్ధరణకు తోడ్పడుతాయి.
.మే జూన్ మాసాలలో విత్తి జూలై మాసంలో పొలంలో కలియదున్నాలి
.నేల భౌతిక స్థితి మెరుగుపరచి, భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది.
.ఒక టన్ను జీలుగ సాగువలన పోషకాల పరిమాణం నత్రజని 6.2 కిలోలు, బాస్వరం 1.5 కిలోలు, పొటాష్ 4.6 కిలోలు లభ్యమవుతాయి.
అందుబాటులో జీలుగ విత్తనాలు : దోమ ఆదిరెడ్డి, డీఏవో, పెద్దపల్లి
జిల్లాలో రైతులకు అవసరమైన జీలుగ విత్తనాలను అందుబాటులో ఉంచాం. 50 శాతం రాయితీపై రూ. 30 కిలోల జీలుగ బస్తాకు రూ. 2317. నాటు వేసే ముందు జీలగ పంటను పొలంలో కలియదున్నితే పచ్చి రొట్ట ఎరువుగా మారి పంటకు మేలు చేస్తుంది. రసాయనిక ఎరువుల వాడకం తగ్గుతుంది.
ACB Summons: 2 వేల కోట్ల స్కామ్లో సిసోడియా, సత్యేంద్రకు ఏసీబీ సమన్లు
MLC Kavitha | కేసీఆర్ను బద్నాం చేసేందుకే నోటీసులు.. రేవంత్ సర్కారుపై కవిత ఫైర్..
Karimnagar | తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. నగదు, బియ్యం బస్తాలు ఎత్తుకెళ్లిన దొంగలు