జ్యోతినగర్, మార్చి 10: పేదింటి అమ్మాయి పెళ్లికి శ్రీ సీతారామ సేవా సమితి(Sitarama Seva Samiti) సభ్యులు అండగా నిలిచారు. దాతల సహకారంతో రూ.40 వేల విలువైన కానుకలను అందజేసి ఆ తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. రామగుండం ఎన్ టి పి సి అన్నపూర్ణ కాలనీకి చెందిన తాళ్లపల్లి జోగయ్య – జయ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. కూలి నాలి పని చేసుకుని పిల్లలను చదివించారు. పెద్దమ్మాయి కరుణ ఇంటర్ పూర్తి చేసింది. ఈ నెల 12వ తేదీన యువతి కరుణ వివాహం నిశ్చయమైంది. హైదరాబాద్కు చెందిన యువకుడు ఆ అమ్మాయిని ఎలాంటి కట్నం కానుకలు లేకుండానే పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు.
అమ్మాయిని అత్తింటికి ఒట్టి చేతులతో పంపించలేక ఇబ్బంది పడుతున్న వధువు తల్లిదండ్రుల దీనస్థితిని తెలుసుకొని శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ స్పందించారు. అమ్మాయి పెళ్లి కోసం దాతల సహాయం అర్థించారు. ఇదివరకే మహిళ చిట్టి సభ్యులు రూ.20 వేలు అందించగా వాటితో పట్టు బట్టలు, బోళ్లు కొనుగోలు చేసి అమ్మాయి తల్లిదండ్రులకు అందజేశారు. ఇంకా దాతలు ముందుకు రావడంతో సోమవారం రూ.40 వేలతో మంచం, బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, ఇతరత్రా సామగ్రిని కొనుగోలు చేసి సోమవారం అమ్మాయికి అందజేశారు. సహకరించిన దాతలకు సీతారామ సేవా సమితి తరఫున చంద్రకళ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సభ్యులు ఐత శివకుమార్, కంది సుజాత, తదితరులు పాల్గొన్నారు.