Sitarama Seva Samithi | కోల్ సిటీ, సెప్టెంబర్ 23 : మానవత్వం పరిమళించింది.. ఇంటి పెద్ద అచేతన స్థితి కారణంగా పుట్టెడు కష్టాలతో ఆపసోపాలు పడుతున్న ఓ నిరుపేద కుటుంబాన్ని శ్రీ సీతారామ సేవా సమితి ఆదుకుంది. పండుగ పూట ఆ కుటుంబం పస్తులుండొద్దని భావించి రెండు నెలల రేషన్, కొత్త బట్టలు అందించింది. మహిళల సేవా నిరతి పలువురికి ఆదర్శంగా నిలిచింది.
మంచిర్యాల జిల్లా సోమగూడెం సమీపంలోని దుబ్బపల్లిలో నివాసం ఉంటున్న ఓరం కార్తీక్ అనే వ్యక్తి ఇటీవల రోడ్డు ప్రమాదంలో నడుము భాగం దెబ్బతింది. దానికి తోడు కాలు కూడా కదలలేని అచేతన పరిస్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. కష్టాలకే కన్నీళ్లు తెప్పించే ఆ కుటుంబ దీన స్థితి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులను కదిలించింది. దీనితో మంగళవారం బాధితుడు కార్తీక్ ఇంటికి వెళ్లి అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మనోధైర్యం అందించారు.
రెండు నెలలకు సరిపడే రేషన్ సరుకులతోపాటు కుటుంబ సభ్యులకు కొత్త బట్టలు అందించి పండుగను సంతోషంగా జరుపుకోవాలని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ, కట్కూరి శాంతి, కొండు రమాదేవి, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబంకు చేయూత ఇవ్వడంలో సహకరించిన కార్తీక్, సురేష్, రాంచందర్, వాసు, శాంతిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎక్కడో దూర ప్రాంతంలో కష్టాల్లో ఉన్న కుటుంబ పరిస్థితి చూసి జాలిపడకుండా.. అక్కడిదాకా వెళ్లి ఆ కుటుంబంలో కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేసిన సేవా సమితి మహిళలను పలువురు అభినందించారు.
Hyderabad Metro | మరోసారి ఆగిపోయిన మెట్రో రైలు.. ఆందోళనకు గురైన ప్రయాణికులు
Fire Accident | మైలార్దేవ్పల్లి పీఎస్ పరిధిలో తప్పిన పెను ప్రమాదం
Harish Reddy | నెలరోజులైనా తెరచుకోని రామగుండం ఎరువుల కర్మాగారం: బీఆర్ఎస్ నేత హరీశ్ రెడ్డి