గోదావరిఖని : హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) లో సింగరేణి సేవా సమితి ఏర్పాటు చేసిన మహిళా శక్తి మార్కెట్.. స్వయం ఉపాధి ఉత్పత్తుల స్టాల్కు ద్వితీయ బహుమతి లభించింది. నుమాయిష్లో మొత్తం 2200కు పైగా స్టాల్స్ ను ఏర్పాటు చేయగా.. ఇందులో ప్రభుత్వ విభాగంలో సింగరేణి సేవా సమితి స్టాల్ కు బహుమతి లభించింది. సోమవారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు.
స్టాల్ డెకరేషన్, వస్తు విక్రయాలు జరుగుతున్న తీరు, సందర్శకుల అభిప్రాయాలు తదితర అంశాలను పరిశీలించిన న్యాయ నిర్ణేతలు ఉత్తమ స్టాల్స్ కు ఎంపిక చేసినట్లు సొసైటీ నిర్వాహకులు వెల్లడించారు. నుమాయిష్ లో ప్రదానం చేసిన బహుమతిని ఈడీ (మార్కెటింగ్), జీఎం(కో ఆర్డినేషన్), సింగరేణి సేవా సమితి ఉపాధ్యక్షులు ఎస్డి.ఎం.సుభానీ, పీఆర్వో, సేవా సమితి కో ఆర్డినేటింగ్ ఆఫీసర్ శ్రీకాంత్, సీఎండీ శ్రీ ఎన్.బలరామ్ కు అందజేశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. సింగరేణి స్టాల్ కు బహుమతి ద్వారా గుర్తింపు రావడం అభినందనీయమన్నారు.
సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మహిళల స్వయం ఉపాధి కోసం సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇప్పిస్తామన్నారు. అలాగే స్వయంగా యూనిట్లు ఏర్పాటు చేసుకున్న మహిళల వస్తువులను విక్రయించేందుకు వీలుగా హైదరాబాద్ నుమాయిష్ లో ప్రతి ఏటా స్టాల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే కాకుండా ఉప్పల్ శిల్పారామంలోనూ సేవా సమితి స్టాల్ ద్వారా సేవా ఉత్పత్తులను విక్రయించేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నిరుద్యోగ యువతీ యువకులకు కూడా సంస్థ తరఫున వృత్తి శిక్షణలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.