ఓదెల, ఫిబ్రవరి 26 : ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చిన భక్తుడికి గుండెపోటు రావడంతో సీపీఆర్ ద్వారా పొత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్ రక్షించారు. వివరాల్లోకి వెళ్తే..బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే భక్తుడు కుటుంబ సభ్యులతో మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకున్నాడు.
కాగా, స్వామివారిని దర్శించుకుంటుండగా శ్రీనివాస్ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి పోయాడు. అక్కడే బందోబస్తు నిర్వహిస్తున్న ఎస్ఐ రమేష్ విషయాన్ని గమనించి వెంటనే సీపీఆర్ చేసి భక్తుడి ప్రాణాలను కాపాడాడు. అనంతరం హాస్పిటల్కు తరలించారు. ఈ సందర్భంగా పలువురు ఎస్ఐని అభినందించారు.