ధర్మారం, ఫిబ్రవరి 25 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో కాకతీయుల కాలం నాటి శివాలయాలు బుధవారం జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైయ్యాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాలను భక్తుల దర్శనం కోసం సిద్ధం చేశారు. మండలంలో నంది మేడారం గ్రామంలో శ్రీ అమరేశ్వర స్వామి, ఖిలా వనపర్తి గ్రామంలో శ్రీ శివాలయం, రచ్చపల్లి గ్రామంలో శ్రీ సాంబమూర్తి ఆలయాలు కాకతీయుల రాజుల పాలనలో ఈ శివాలయాలు నిర్మితమైయ్యాయి. ప్రతి ఏటా ఈ ఆలయాలలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు.
ఈ క్రమంలో భక్తుల దర్శనం కోసం ఆలయాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలలతో అలంకరించారు. ఆయా మండపాలలో శివపార్వతుల కళ్యాణం కోసం ప్రత్యేకంగా షామియానాలు ఏర్పాటు చేయించారు. నంది మేడారంలోని శ్రీ అమరేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా గర్భగుడిలోని శివుడికి అభిషేకం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ మణిశర్మ తెలిపారు. అదేవిధంగా రచ్చపల్లిలోని శ్రీ సాంబమూర్తి ఆలయంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ తరహాలో భక్తులు కోడెమొక్కుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
ఇక్కడ గత రెండు రోజుల నుంచి స్వామివారి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం శివపార్వతుల కళ్యాణోత్సవం నిర్వహిస్తుండగా బుధవారం మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి రథోత్సవం జరపడానికి వారు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆయా గ్రామాలలో ని శివాలయాలలో జరిగే బుధవారం నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులకు కోరారు.