ముత్తారం, జూలై 25: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రానికి చెందిన రౌతు రష్మిక (7) చికిత్స పొందుతూ మృతిచెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రౌతు రాజు, మౌనికకు కూతురు రష్మిక, కొడుకు రిత్విక్ ఉన్నారు. రష్మిక స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నది. ఆడుతూ పాడుతూ ఉండే రష్మీక అనారోగ్యానికి గురికావడంతో హాస్పిటల్కు తీసుకెళ్లారు. పరీక్షల అనంతరం ఆమె గుండె సంబంధిత వ్యాధి ఉందని డాక్టర్లు తెలిపారు. దీంతో మెరుగైన చికిత్స కోసం చిన్నారిని హైదరాబాద్లోని నీలోఫర్ దవాఖాన చేర్పించి గత రెండు నెలలుగా తమ శక్తికి మించి చికిత్స అందిస్తున్నారు.
పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి రష్మిక మరణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో సుమారు రూ.6 లక్షల వరకు ఖర్చు పెట్టినా చిన్నారి ప్రాణం దక్కలేదని తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఎప్పుడు ఆడుతూ పాడుతూ తిరిగే రష్మిక చనిపోవడంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం పరంగా రష్మిక కుటుంబ సభ్యులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.