మంథని రూరల్: మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నీటి ఎద్దడి లేకుండా కార్యదర్శులు చర్యలు చేపట్టాలని డీఎల్పిఓ సతీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని సిరిపురం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నీటి సమస్య ఉన్న గ్రామంలో ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు ప్రత్యామ్నాయంగా నీటి సరఫరాకు ట్యాంకర్లను వినియోగించుకోవాలన్నారు.
అదేవిధంగా గ్రామంలో చెత్త సేకరణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. దీంతోపాటుగా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతిరోజు నీరు నిలువైన చోట క్లోరినేషన్ చేయాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని ఆదేశించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఎల్ఆర్ఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.