పెద్దపల్లి రూరల్, జూలై 29: అధికారుల నిర్లక్ష్యం, ఉన్నతాధాకారులపర్యవేక్షణాలోపం ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది. పెద్దపల్లి (Peddapalli) మండలంలోని గుర్రాంపల్లి, మారేడుగొండ, రాఘవాపూర్ గ్రామాలు. పాలక వర్గాల పదవీకాలం ముగిసి ప్రత్యేకాధికారులకు బాధ్యతలు వచ్చినప్పటి నుంచి ప్రజలు పడుతున్న బాధలు వర్ణణాతీతంగా కనిపిస్తోంది. గ్రామాల్లో వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్ష మీటింగులు పెట్టి మొత్తుకుంటున్నా గ్రామస్థాయి అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు.
రాఘవాపూర్ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామం పవర్ హౌజ్ కాలనీ చెరుకుగడ్డలో జిన్నింగ్ మిల్లువద్ద వర్షపు నీరు నిలిచి సీసీ రోడ్డుపైనే నీళ్లు నిలడంతో అవి దోమలకు ఆవాసాలుగా మారాయి. దీంతో ప్రజలు రోగాల బారిన పడి దవఖాన పాలు కావడం చాలామంది మంచం పట్టడంతో అక్కడి అధికారులు అప్రమత్తమై సీసీ రోడ్డు పైన నిలిచిన నీటిని మోటార్లు పెట్టి బయటకు పంపించారు. ఇంటింటికీ తిరుగుతూ ఎంతమందికి వ్యాధులు వచ్చాయనీ వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేధించే పనిలో ఉన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ మూడు గ్రామాలే కాదు మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుద్ద్య చర్యలు చేపట్టి ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని కోరుతున్నారు.