పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణం మున్సిపల్ పరిధిలోని రంగంపల్లిలో నూతనంగా నిర్మాణం చేపట్టిన సఖీ కేంద్రం (Sakhi Center) నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. భవన నిర్మాణానికి రూ.45 లక్షలు మంజూరు చేయించిన అప్పటి ఎస్సీ,ఎస్టీ, వయోవృద్దుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.. 2021 జూన్ 24న శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణపనులను పొందిన కాంట్రాక్టర్.. మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో మూడున్నరేండ్లకు పూర్తి చేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రారంభించేనేలా పనులు పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్శ ఆదేశాలతో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్ పర్యవేక్షణలో ఏర్పాట్లు చురుకుగా చేస్తున్నారు. పనులు ఈ నెల 8 లోపు పూర్తి అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజుననే ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది. ప్రారంభ కార్యక్రమానికి జిల్లాకు చెందిన శాసనసభ వ్యవహారాలు, ఐటీ పురపాలక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరౌతారా.. లేదా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్శచేతుల మీదుగానే ప్రారంభిస్తారా.. అనేది మాత్రం గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది.