రామగిరి మర్చి 25 : 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రామగుండం-3 ఏరియాకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిందని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, కార్మికులకు ఆయన అభినందనలు తెలియజేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి యాజమాన్యం రామగుండం-3 ఏరియాకు నిర్దేశించిన 62.50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 100 శాతం అనగా 62.5003 లక్షల టన్నుల బొగ్గును ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి 7 రోజుల ముందుగానే ఉత్పత్తి చేసినందుకు సంస్థ సిబ్బందిని అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థకు అద్భుతమైన నాయకత్వం అందించడమే కాకుండా క్షేత్ర స్థాయి పర్యటనలతో ఉద్యోగులందరిలో చైతన్యం కలిగిస్తూ, ప్రోత్సాహాన్ని నింపుతూ చక్కని మార్గదర్శకత్వం అందిస్తున్న సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్, ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్న డైరెక్టర్ (ఇ & ఎం) డి.సత్యనారాయణ రావు, డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ, డైరెక్టర్ (ప్లానింగ్, ప్రాజెక్ట్స్ అండ్ పా) కొప్పుల వెంకటేశ్వర్లుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఉద్యోగులందరూ భవిష్యత్తులో ఇదే ఒరవడిని కొనసాగిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సమిష్టి కృషితో, భద్రతతో సాధిస్తూ సింగరేణి సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.