పెద్దపల్లి: హైకోర్టులో సింగరేణి (Singareni) అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన చందుపట్ల రమణ కుమార్ రెడ్డి (Ramana kumar Reddy) నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ న్యాయ వ్యవహారాలు, శాసన వ్యవహారాల కార్యదర్శి ఆర్. తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హైకోర్టులో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కి అదనపు స్టాండింగ్ కౌన్సెల్‌గా ఆయన మూడేండ్లపాటు వ్యవహరించనున్నారు.
సింగరేణి గనులు విస్తరించి ఉన్న పెద్దపల్లి జిల్లా నుంచి స్టాండింగ్ కౌన్సిల్‌కు తాను ఎంపిక కావడంతో సింగరేణి సంస్థ, ఉద్యోగులు, ల్యాండ్ అక్విజేషన్, కాంట్రాక్టు, సర్వీస్ మ్యాటర్స్, ఇతర న్యాయ వ్యవహారాల పరిష్కారానికి కృషి చేస్తానని రమణ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ద్వారా చార్జి తీసుకున్నారు.