మంథని, ఫిబ్రవరి 17: పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలోనే అగ్రస్థానంలో నిలిపిన గొప్ప వ్యక్తి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. కేసీఆర్ 71 వ జన్మదిన వేడుకలు(KCR birthday) పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. మంథనిలోని ముక్తి ఆశ్రమం వద్ద పుట్ట మధుకర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మొక్కలు నాటి కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి భారతదేశానికి గర్వకారణంగా నిలిపారన్నారు. కేసీఆర్ కన్న కలలు మధ్యలోనే ఆగిపోవడంతో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాధతో ఉన్నారన్నారు. మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు కేసీఆర్ పాలనాపరమైన సేవలందించడం ఖాయమన్నారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని నియోజకవర్గ ప్రజల పక్షాన కోరుకుంటున్నామన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.