పెద్దపల్లి, మార్చి 19( నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన రెండో బడ్జెట్(Budget) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్ధ పాలనకు నిదర్శనమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తీవ్రంగా విమర్శించారు. బుధవారం ఆయన తెలంగాణ బడ్జెట్ పై మాట్లాడారు. ఎన్నికల ముందు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలను తుంగలో తొక్కి కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపడానికి ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి బడ్జెట్ లో కేటాయింపులు చేయడం సిగ్గు చేటన్నారు. వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 500 రోజులైనా అమలు చేయకపోగా అందులో పేర్కొన్న అంశాలను తప్పుదారి పట్టించే ప్రక్రియకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు.
ఆరు గారంటీల్లో యువ వికాసం పేరుతో ప్రతి విద్యార్ధికి రూ. 5 లక్షల విద్యాభరోసా కార్డు ఇస్తామని చెప్పి ఇప్పుడు యువ వికాసం పథకాన్ని కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపే పథకంగా మార్చారన్నారు. తెలంగాణ అక్కాచెల్లళ్లకు ప్రతినెలా ఇస్తా అన్న రూ. 2500 కు బడ్జెట్ లో కేటాయింపులు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. అంకెల గారడీతో ఆరు గ్యారంటీలకు ఎగనామం పెట్టి, రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను, ఆటో డ్రైవర్లను, గిగ్ వర్కర్లను, మహిళలను, ఉద్యోగులను సబ్బండ వర్గాలను నిండా ముంచిన బడ్జెట్ అని ఆయన విమర్శించారు.