పాలకుర్తి : పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ గ్రామపంచాయతీకి నూతన భవనం నిర్మించాలని గ్రామంలో ఇటీవల సర్పంచిగా పోటీచేసి ఓడిపోయిన తువ్వా సతీష్, మహిళలు ఆదివారం ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. ప్రస్తుతం గ్రామపంచాయతీ భవనం మహిళా సంఘం భవనంలో కొనసాగుతుందన్నారు. మహిళా స్వశక్తి సంఘాలకు భవనాన్ని గ్రామపంచాయతీ సిబ్బంది, పాలకవర్గం ఉపయోగించడం మూలంగా మహిళలకి ప్రత్యేక భవనం లేకపోవడంతో మహిళా సమావేశాలన్నీ ఆరుబయట చెట్ల కింద నిర్వహించుకోవడం ఇబ్బందికరంగా మారిందని ఆందోళన చేపట్టారు.
గతంలో బసంత్ నగర్ గ్రామపంచాయతీ ఉమ్మడి పాలకుర్తి గ్రామంలో కొనసాగింది. బసంత్ నగర్ గ్రామానికి స్థానికంగా కమ్యూనిటీ భవనం ఉన్నప్పటికీని, సదరు కమ్యూనిటీ భవనం స్థల వివాదంతో పంచాయతీకి పూర్తిస్థాయిలో భవనం లేకుండా పోయింది. అధికారులు వెంటనే స్పందించి బసంత్ నగర్ గ్రామానికి ప్రత్యేక గ్రామపంచాయతీ భవనం నిర్మించాలని కోరారు. ఆయనకు మద్దతుగా పలువురు మహిళలు గ్రామస్తులు అండగా నిలిచారు