రామగిరి, జూన్ 9: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున నాగేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లిన ముత్తారం పోలీసులు ఆయన్ను స్టేషన్‌కు తీసుకెళ్లారు.
ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌లో సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసు విచారణ క్రమంలోనే సత్యనారాయణ గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సత్యనారాయణ గౌడ్‌ను పోలీసులు తీసుకెళ్లడంపై ఆయన కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై అభ్యంతరం తెలిపారు. పూర్తి వివరాను వెల్లడించాలని కోరారు.
కాగా, ముందస్తు నోటీసు ఇవ్వకుండా బీఆర్ఎస్ నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.