కోల్ సిటీ, మార్చి 20 : వారంతా పట్టుబట్టారు..ఆ వీధికి రోడ్డు సాధించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 33వ డివిజన్లో రోడ్డు అధ్వాన్నంగా ఉండటంతో ఆగ్రహించిన మాజీ కార్పొరేటర్ బొబ్బిలి సతీశ్ ఆధ్వర్యంలో బస్తీ ప్రజలు ఈనెల 3వ తేదీన కాలనీలో మండుటెండలో నాలుగు గంటల పాటు బైఠాయించారు. జిల్లా కలెక్టర్ వచ్చేంత వరకు విరమించమని పట్టుబట్టి భీష్మించుకుని కూర్చున్నారు. దాంతో కార్పొరేషన్ అధికారులు అక్కడకు చేరుకొని రోడ్డు వేయిస్తామని పక్షం రోజుల గడువు కోరారు.
ఇచ్చిన మాట ప్రకారం గురువారం అధికారులు ఆ డివిజన్లో రోడ్డు పనులను ప్రారంభించారు. తమ ఆందోళనను అర్థం చేసుకొని రోడ్డు పనులు చేపడుతున్నందుకు గానూ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ జే.అరుణ శ్రీకి డివిజన్ ప్రజల పక్షాన మాజీ కార్పొరేటర్ బొబ్బిలి సతీష్ కృతజ్ఞతలు తెలిపారు. కాలనీ మహిళలు హర్షం వ్యక్తం చేశారు.