Peddapalli | పెద్దపల్లి, మే 15( నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లాలో శాంతియుతంగా నిరసనకు దిగిన రైతులతో కాంగ్రెస్ నాయకుడు, దేవునిపల్లి నర్సింహస్వామి ఆలయ చైర్మన్ అట్ల కుమార్ దురుసుగా ప్రవర్తించాడు. రాస్తారోకో చేస్తున్న రైతులను ఇష్టమొచ్చినట్లు బూతులు తిట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు అట్ల కుమార్‌కు దేహశుద్ధి చేశారు.
పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో సన్న వడ్లను కొనడం లేదని గురువారం సాయంత్రం రైతులు రాస్తారోకో నిర్వహించారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలపడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న కాంగ్రెస్ నాయకుడి వాహనం కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుంది. దీంతో అసహనానికి గురైన కుమార్.. రైతుల వద్దకు వచ్చి దురుసుగా ప్రవర్తించారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన రైతులను బూతులు తిడుతూ అవమానకరంగా మాట్లాడారు. అట్ల కుమార్ తీరుతో కోపోద్రేక్తులైన రైతులు తిరగబడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి వడ్లు తీసుకొచ్చి రోజులు గడిచిపోతున్నా.. సన్న వడ్లు కొనడం లేదని శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే.. తిట్టడం ఏంటని నిలదీశారు. అలాగే కుమార్‌కు దేహశుద్ధి చేశారు. చివరకు అక్కడే ఉన్న పోలీసులు నచ్చజెప్పడంతో రైతులు శాంతించారు.
కీలక పదవిలో ఉండి రైతుల పట్ల ఇలా వ్యవహరించడమేంటని అట్ల కుమార్ తీరుపై రైతులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను రైతులు డిమాండ్ చేశారు.