పెద్దపల్లి రూరల్, మే 22: గతకొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొనుగోలు కేంద్రాలకు వడ్లు అమ్మకానికి తెచ్చిన అన్నదాత అతలాకుతలం అవుతున్నాడు. పెద్దపల్లి (Peddapalli) మండలంలోని అప్పన్నపేట, పెద్దపల్లి సింగిల్ విండో పరిధిలోని గ్రామాల్లో రైతులకు వెసలుబాటుగా ఉండే చోట్ల, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీతోపాటు మండలంలోని గౌరెడ్డిపేట, ముత్తారం, జూలపల్లి మార్కెట్ కమిటీలలో హైదరాబాద్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధికారులు వరి ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు. కానీ సకాలంలో రవాణాకు సరిపడా వాహనాలు రాక, అవి వచ్చినా హమాలీలు లేకపోవడంతో కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా సాగలేదు. ఇదిలా ఉంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఈ ఏడాది ఎన్నడూ లేనివిధంగా రోహిణి కార్తె ప్రవేశానికి ముందే అకాల వర్షాలు పడుతూ రైతుల ఆశలను ఆవిరి చేస్తున్నాయి.
ఇటీవల కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యం కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే విజయరమణారావు.. రైతులు ఎలాంటి భయాందోళనకు గురి కావొద్దని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఒక్క గింజ కూడా వదలకుండా కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతోపాటు, సంబంధిత అధికారులకు రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. అయినా కొనుగోళ్లలో వేగం పెరుగకపోగా తడిసిన ధాన్యం అక్కడక్కడా మొలకలొస్తున్నాయి. దీంతో వడ్లను అమ్ముకునేదెలా అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ ఓ వైపు హెచ్చరిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం అలసత్వం వీడటం లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు, స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా మిగిలిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.