కోల్ సిటీ : రోడ్లపైకి పశువులను విడిచిపెడుతున్న యజమానులకు రామగుండం నగరపాలక సంస్థ ఆఖరి హెచ్చరిక జారీచేసింది. ఈ మేరకు బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్, అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ నోటీసు విడుదల చేశారు. గత నెల 23న నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లపై తిరుగుతున్న ఆవులను సంజయ్ గాంధీ నగర్లోని గోశాలకు తరలించే చర్యలు చేపట్టామని, ఇప్పటివరకు 77 పశువులను గోశాలకు తరలించామని తెలిపారు.
కాగా పశువుల యజమానులు 31 పశువులను విడిపించుకొని వెళ్లారన్నారు. మళ్లీ రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పశువులను వదిలిపెడుతున్నారనీ, ఇకపై ఆవులతోపాటు గేదెలను సైతం బంధించి గోశాలకు తరలిస్తామని హెచ్చరించారు. యజమనులు నగరపాలక సంస్థకు రూ.10 వేల జరిమానాతోపాటు రోజుకు రూ.250 చొప్పున నిర్వహణ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. తమ పశువులు రోడ్లపైకి రాకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.