ధర్మారం, మార్చి 11: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన అలువాల రమేష్ అనారోగ్యంతో మరణించగా మండల పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కొలుముల దామోదర్ యాదవ్ తన ఫౌండేషన్ తరపున అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేశారు. రమేష్ పచ్చకామెర్ల వ్యాధితో బుధవారం తెల్లవారుజామున మరణించాడు. మృతుడిది నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియల కోసం సహాయం అందించాలని ఎన్ఆర్ఐ దామోదర్ యాదవ్ కు గ్రామస్తులు ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు. దీంతో దామోదర్ యాదవ్ మానవతా దృక్పథంతో స్పందించి రూ.5,000 ఆర్థిక సహాయాన్ని పంపించారు.
ఫౌండేషన్ సభ్యుడు, స్థానిక యాదవ సంఘం అధ్యక్షుడు తమ్మడవేణి అంజయ్య ఆధ్వర్యంలో మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. అంజయ్య వెంట బీసీ జిల్లా కన్వీనర్ తమ్మడవేణి శ్రీనివాస్, వార్డు సభ్యులు కొమ్మ శ్రావణి, వేల్పుల కుమార్, బీసీ ఆజాద్ ఫెడరేషన్ ధర్మపురి నియోజకవర్గ ఇన్ చార్జి మూదాం శ్రావణ్, అల్వాల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.