తాండూర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన పించన్ డబ్బుల పెంపు హామీని వెంటనే అమలు చేయాలని కోరుతూ తాండూర్ మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ జ్యోత్స్నకు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య, వీహెచ్ పీఎస్ (వికలాంగ హక్కుల పోరాట సమితి) ఆధ్వర్యంలో మంగళవారం నాయకులు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సమ్మయ్య మాదిగ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వికలాంగులకు రూ.6 వేలు, మిగతా పించన్ దారులకు రూ.4 వేలు పెంచి అందజేస్తామని ఇచ్చిన హామీ మర్చిపోయారా సీఎం గారూ..? అంటూ నిలదీశారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి, ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోందని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ పించన్ దారులకు పించన్ డబ్బులను పెంచి అందజేయాలని, లేని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి జిలకర శంకర్, రత్నం ఐలయ్య, అయిల్ల గణేష్, ఆసరా పించన్ దారులు, తదితరులు పాల్గొన్నారు.