మంథని రూరల్: ఉపాధి హామీ పనులు(Employment guarantee works) జరుగుతున్న ప్రదేశాల్లో కూలీలకు అన్ని వసతులు కల్పించాలని ఎంపీడీవో శశికళ ఫీల్డ్ అసిస్టెంట్లను ఆదేశించారు. మంగళవారం మండలం లోని కాకర్లపల్లి గ్రామంలో ఆమె ఉపాధి హామీ పనులను పరిశీలించారు .ఈ సందర్భంగా కూలీలకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండి పరిశీలిం చాలన్నారు. కూలీలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
పని ప్రదేశాల్లో కూలీలకు అత్యవసర సమయాల్లో ఉపయోగించే మెడికల్ కిట్టు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచడంతోపాటుగా నీడ సౌకర్యం మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యదర్శిలు సైతం గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు సమన్వయం చేసుకుంటూ కూలీలకు మెరుగైన కూలి అందేలాగా చర్యలు చేపట్టాలన్నారు. ఎండలు తీవ్రమవుతున్న తరుణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూలీలకు వివరించడంతోపాటు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్లు కార్యదర్శులతో రివ్యూ మీటింగ్ లో నిర్వహించడంతోపాటు గ్రామాల్లో వారికి తలెత్తుతున్న ఇబ్బందుల సైతం పరిష్కరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కూలి ఎక్కువ వచ్చేలాగా పనులు చేపించాలన్నారు. ఒకరికి బదులు ఒకరు పనులు చేస్తే కూలి చెల్లించవద్దని సూచించారు. ఎవరైనా ఇలాంటి పనులకు పాల్పడితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న కూలీలు తమకు తెలుపాలని కోరారు. ఆమె వెంట ఎంపీఓ శేషయ్య సూరి, ఏపీవో సదానందం ఉన్నారు.