పెద్దపల్లి, మార్చ్ 24( నమస్తే తెలంగాణ): వడగండ్ల వానతో పెద్దపల్లి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో రైతులు పంట నష్టపోయారని, వారికి తక్షణమే పంట నష్టపరిహారం అందించాలని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. హైదారాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పంట నష్టం, రైతులకు పరిహారం చెల్లింపుపై వినతిపత్రం అందజేశారు.
నియోజకవర్గంలోని 2 మండలాల్లోని 11 గ్రామాల్లో 1035 మంది రైతులకు చెందిన వరిపంట దెబ్బతిందని, 6 మండలాల్లోని 28 గ్రామాల్లో 828 మంది రైతులకు చెందిన 1084 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు వర్షం వల్ల నష్టం వాటిల్లిందని సీఎంకు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా వ్యవసాయ అధికారులతో పంటనష్టం సర్వే చేయించి ప్రాథమిక అంచనా రూపొందించామని పేర్కొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వాలని కోరారు. పంట నష్టపోయిన రైతులకు తొందరలోనే పరిహారం అందించి ఆదుకుంటామని ఎమ్మెల్యే రైతులకు భరోసా ఇచ్చారు.