Putta Madhu | బీసీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఎన్ని కష్టాలు ఉంటాయో దానికి నేనే సాక్ష్యమని పుట్ట మధు అన్నారు. హైకోర్టు అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య కేసుకు సంబంధించి రామగుండం కమిషనరేట్లో పుట్ట మధు దంపతులు సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వామన రావు దంపతుల హత్య కేసులో సీబీఐ దర్యాప్తుకు సహకరించామని తెలిపారు.
మంథని మధుకర్ కేసు హైకోర్టు నుంచి ఎందుకు బయటకు వస్తలేదని పుట్ట మధు ప్రశ్నించారు. అదే వామనరావు కేసు మాత్రం సీబీఐకి వెళ్లిందని అన్నారు. ఈ కేసులో సీబీఐ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుందని తెలిపారు. కానీ మంథని మధుకర్ కేసు మాత్రం హైకోర్టులోనే ఉందన్నారు. మంథని మధుకర్ తల్లి చెప్పిన పేర్లన్నీ కాంగ్రెస్ నాయకులవే అని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచినందుకే నన్ను, నా భార్యను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రోద్బలంతోనే వామనరావు తండ్రి మాట్లాడాడని అన్నారు. వామనరావు కేసును సీబీఐకి అప్పగించిన శ్రీధర్ బాబు.. మంథని మధుకర్ కేసును సీబీఐకి ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు. తనకు వచ్చిన 70 వేల ఓట్ల ఆదరణనను చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు.
అల్లుడు తప్పు చేస్తే మామకి శిక్ష ఎక్కడా లేదని పుట్ట మధు అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, చట్టంపై నమ్మకం ఉందని తెలిపారు. మంథని మధుకర్ హత్యపై కూడా సీబీఐ అన్ని కోణాల్లో విచారణ జరిపి, వాస్తవాలను బయటపెట్టాలని కోరారు. వామనరావు హత్య కేసులో తన మీద కుట్రలు చేస్తున్నారని అన్నారు. మంథని మధుకర్ హత్యలో శ్రీధర్ బాబు హస్తం లేదా అని ప్రశ్నించారు.