సుల్తానాబాద్ రూరల్ నవంబర్ 18 : పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచరామి గ్రామంలో కోతుల ఆగడాలు మితిమీరి పోతున్నాయి. దీంతో ఇంటి నుంచి బయటకు రావడానికి గ్రామ ప్రజలు జంకుతున్నారు. గతంలో కోతుల నివారణకు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎస్పీ ఉప్పు తిరుపతి సొంత ఖర్చులతో కొండెంగను తెప్పించారు. కొండెంగను ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి ఊరంతా తిప్పుతూ కోతులను తరిమివేశారని, అతను మానేయడంతో కోతుల బెడద మళ్ల పెరిగిందని గ్రామస్తులు వాపోయారు.
ఏ ఇంటిని తట్టిన కూడా ఒకరిద్దరికి కోతులు దాడి చేసిన గాయాలు కనిపిస్తున్నాయి.
కోతుల దాడిలో గాయపడి వారు సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ఇబ్బంది పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా ఇప్పటివరకు 25 మంది వరకు గాయపడ్డారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతులను గ్రామంలో లేకుండా చేయాలని కోరుతున్నారు. కాగా, జిల్లా అధికారుల ఆదేశాలు మేరకు ఇటీవల సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో కోతుల నియంత్రణకు చర్యలు చేపట్టారు.