ధర్మారం, సెప్టెంబర్ 1: పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన మేకల రవి (50) అనే వ్యక్తి గ్రామ శివారులోని వాగులో చేపల వేటకు వెళ్లి కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రవికి భార్య సునీత, ఇద్దరు కుమార్తెలు ప్రత్యూష, కావ్య ఉన్నారు. కూలి నాలి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం గ్రామ శివారులోని వాగులో చేపల వేట కోసం వెళ్లాడు. చేపలు పట్టే ముందు వాగు ఒడ్డు పై ఉన్న ఓ రైతు పంప్ సెట్ స్టార్టర్ లో విద్యుత్ తీగను అమర్చాడు. ఆ తీగను పట్టుకొని వాగు లోకి చేపలు పట్టేందుకు వెళుతుండగా రవి కాలికి ప్రమాదవశాత్తు అదే తీగ తగిలి కరెంటు షాక్ తో అక్కడికక్కడే మరణించాడని గ్రామస్తులు తెలిపారు.
సోమవారం ఉదయం ఓ వ్యక్తి వాగు ఒడ్డుపై వెళ్తుండగా గమనించడంతో రవి మరణించిన విషయం వెలుగు చూసింది. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వాగు వద్దకు చేరుకున్నారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో ధర్మారం ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వాగులో నుంచి రవి మృతదేహాన్ని పోలీసులు బయటికి తీయించి శవ పంచనామా నిర్వహించారు. కుటుంబానికి పెద్ద దిక్కైన రవి మరణంతో కుటుంబ సభ్యులు మృతుడి మృతదేహం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు.