పెద్దపల్లి రూరల్ నవంబర్ 28 : పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను కారు ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామానికి చెందిన పిడుగు గోపాల్ ఎఫ్‌సీఐలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రోజు వారి మాదిరిగానే శుక్రవారం కూడా తన బైక్ పై వెళ్తున్న క్రమంలో అందుగులపల్లిలోని ఇంటి నుంచి బయలు దేరి గ్రామ సమీపంలోని పెట్రోల్ పంపు దాటుతున్నాడు.
ఈ క్రమంలో పెద్దపల్లి వైపు నుంచి గోదావరిఖని వైపే వెళ్తున్న కారు వెనుక నుంచి వేగంగా ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న పిడుగు గోపాల్ ఎగిరి రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సరోజనతో పాటు రమ్య, హిందు అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్దపల్లి రూరల్ ఎస్ఐ మల్లేష్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెద్దపల్లి దవఖానకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.