పెద్దపల్లి రూరల్, నవంబర్ 16: పెద్దపల్లి మండలంలోని (Peddapalli) దస్తగిరిపల్లి- కొలనూర్ గ్రామాల మధ్య కొత్తపల్లి సమీపంలోని వాగుపై ఇటీవలనే పెద్ద బ్రిడ్జి నిర్మించారు. కొన్ని దశాబ్దాల కాలంగా వర్షాలు పడి వరదలొస్తే రాకపోకలు నిలిచి ప్రమాదంగా మారిన లోలెవల్ కాజ్ వే(రోడ్ డ్యాం) పై బ్రిడ్డి నిర్మించేందుకు గత ప్రభుత్వం రూ.2.40 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఆ నిధులతో పనులను ప్రారంభించిన కాంట్రాక్టర్ ఆలస్యంగా అయినా సరే పనులను పూర్తి చేశారు. కానీ అసంపూర్తిగా వదిలేశారు. అధికారుల పర్యవేక్షణ లేకనా..? లేదా పట్టింపులేనితనమో ఏమోగాని బ్రిడ్జి నిర్మాణ పనులు ముగిసినా పనులు చేసిన కాంట్రాక్టర్ మూలంగా వాహనదారులకు, ప్రజలకు, భారీ వాహనాలకు తిప్పలు తప్పడంలేదు. బ్రిడ్జి వద్ద ఇరువైపుల రెండు భారీ వాహనాలు వస్తే సైడ్ తీసుకుని వెళ్లేలా రహదారిని వెడల్పుగా మట్టి (మొరం) పోయాల్సి అండగా అలాంటి చర్యలేమి చేపట్టక పోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలోనే పెద్దపల్లి నుంచి ఓదెలవైపు వెళ్తున్న లోడుతో వెళ్తున్న లారీ, అక్కడే పోలాలు కోసేందుకు వెళ్తున్న హార్వెస్టర్లు అదే బ్రిడ్జిపై నుంచి వెళ్తుండగా ఇరుక్కుపోయాయి. లారీ వెనుకకు జారీ మట్టిలో దిగబడడంతో గంటల తరబడి రెండు వైపుల వాహానాలు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు, రోడ్లు భవనాల శాఖ ఉన్నత అధికారులు దృష్టి సారించి నిర్లక్ష్యంగా వ్యవహరించి పనులు అసంపూర్తిగా వదిలేసిన అధికారులు, కాంట్రాక్టర్‌పై అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.