పెద్దపల్లి, మార్చ్ 25(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలు ఇస్తామని ప్రజలను మోసం చేసిందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు. మంగళవారం ఆయన పెద్దపల్లి జిల్లా పర్యటనకు రాగా పెద్దపల్లి సీపీఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో దాదాపు100 బైకుల ర్యాలీతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెద్దపల్లి బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సమస్యలపై సర్వేలు చేస్తున్నామని సర్వేల ద్వారా వచ్చిన సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 6 గ్యారంటీల్లో ఒక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతావి ఏమి అమలు జరగలేదని అన్నారు. మహిళలకు ఇస్తామన్న రూ.2500లు అమలు జరగలేదన్నారు. వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న రూ. 12000లు ఇవ్వలేదని, ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షల ఇస్తామన్నది అమలు జరగలేదని అన్నారు. అలాగే రైతుబంధు పంట రుణమాఫీ సైతం పూర్తిగా కాలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలు ఇండ్లు, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారని వాళ్లకి ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు.
రెండు సంవత్సరాలుగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలను గుర్తించి భూ పోరాటం చేస్తోందన్నారు. గుడిసెలు వేసుకొని నివాసముంటున్న పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని, ఇల్లు కట్టుకోవడానికి రూ. 5,00,000లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గల కూనారం రైల్వే బ్రిడ్జి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని, పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, జిల్లాలో పంట నష్టపోయిన మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, రాష్ట్ర నాయకులు భిక్షమయ్య, కోట రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రవెల్లి ముత్యంరావు, జిల్లా కమిటీ సభ్యులు కల్లేపల్లి అశోక్, సీపెళ్లి రవీందర్, జి. జ్యోతి, మండల కమిటీ సభ్యులు మోదంపల్లి శ్రావణ్, జిల్లాల ప్రశాంత్, సీపెళ్లి దిలీప్, నవీన్, వెంకటస్వామి, ఖాజా, రాజమలు, సాగర్లతో పాటు పలువురు పాల్గొన్నారు.