పెద్దపల్లి : కట్టుకున్న భార్యను కడతేర్చిన(Wife murder) కేసులో నిందుతునిపై నేరం రుజువు కావటంతో జీవిత ఖైదు విధిస్తూ గోదావరిఖని అదనపు జిల్లా న్యాయ మూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు శుక్రవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం …ముత్తారం మండలం ఖమ్మంపల్లి కి చెందిన కన్నం స్వరూపను 22 సంవత్సరాల క్రితం జూలపల్లి గ్రామానికి చెందిన కోల తిరుపతికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి కొడుకు, కూతురు ఉంది. అయితే తిరుపతి నిత్యం స్వరూపను శారీరకంగా వేధిస్తూ కొట్టేవాడు.ఈ క్రమంలో నవంబర్ 6, 2020 లో ఇంట్లో ఎవరు లేని సమయం లో తిరుపతి తన భార్య స్వరూపను దిండుతో శ్వాస ఆడకుండా చేసి హతమార్చాడు.
దీంతో మృతురాలి సోదరుడు కన్నం రాజేందర్ ఫిర్యాదు మేరకు అప్పటి కమాన్పూర్ ఎస్ఐ శ్యామ్ పటేల్ కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టగా అప్పటి గోదావరిఖని 2 వ టౌన్ సీఐ కె.లక్ష్మీనారాయణ గోదావరిఖని కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అనంతరం గోదావరిఖని అదనపు జిల్లా న్యాయ స్థానంలో ఈ కేసు విచారణ జరుగగా ప్రాసిక్యూషన్ తరఫున కమన్పూర్ కోర్ట్ కానిస్టేబుల్ అశోక్, కోర్ట్ లైజన్ ఆఫీసర్ కొత్తకొండ శంకర్, టూ టౌన్ ప్రస్తుత సీఐ కె.ప్రసాదరావు ఆధ్వర్యంలో 16 మంది సాక్షులను కోర్టులో ప్రవేశ పెట్టారు.
పబ్లిక్ ప్రాసెక్యూటర్ జ్యోతి రెడ్డి ప్రాసిక్యూషన్ తరఫున తన వాదనలు వినిపించారు. నిందితుని పై నేరం రుజువు కావటంతో న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు కోలా తిరుపతికి జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధించారు. నేరస్థునికి శిక్ష విధించటంలో కృషి చేసిన పోలీసులను గోదావరిఖని సబ్ డివిజన్ ఏసీపీ మడత రమేష్, రామగుండం సీపీ శ్రీనివాసులు అభినందించారు.