మంథని, మార్చి 24: ప్రభుత్వ భూములను అక్రమించిన వారికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన తనను రియల్ఎస్టేట్ మాఫీయా చంపేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని హైకోర్టు న్యాయవాది, మంథని మేజర్ గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సత్యనారాయణ అన్నారు. మంథనిలోని ప్రెస్ క్లబ్లో సోమవారం ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూములపై కేసులు వేసిన నాగవెల్లి రాజలింగమూర్తి లాగానే తాను కూడా గతంలో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను అక్రమించుకున్న వారిపై హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వాజ్యం ఇంకా పెండింగ్లో ఉందన్నారు.
ఆ భూములను డెవలప్ తీసుకున్న కొంత మంది రియల్ ఎస్టేట్ మాఫియా వ్యక్తుల వల్ల తనకు ప్రాణభయం ఉందని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గత ఆరు నెలలుగా జరుగుతున్న వేదింపులు, మానసిక క్షోభతో తన తండ్రి గత నెలలో ఆకస్మికంగా మృతి చెందాడని, తన తండ్రిని కోల్పోయిన బాధలో నేను ఉంటే ఇటీవల దారుణ హత్యకు గురైన భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగ మూర్తి లాగానే తనను కూడా చంపేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్చేస్తూ, పోస్టింగ్స్పెడుతూ, కామెంట్స్రాస్తున్నారన్నారు.
వ్యక్తిగత జీవితంతో పాటు తాను ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది వృత్తిపై, తన కుటుంబ సభ్యులపైన అనేక మార్లు పరోక్షంగా పోస్టింగ్స్చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం నాకు కల్పించిన గన్మెన్లను కక్ష పూరితంగా తొలగించేలా చేయడంతో పాటు రక్షణ లేని నన్ను సులువుగా హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. దీనిపై రాష్ట్రంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను ఆశ్రయిస్తానని, తనకు, తన కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని జరిగిన పూర్తి భాద్యత స్థానిక యంత్రాంగంతో పాటు పరోక్షంగా మాఫియాకు సహకారం అందిస్తున్న మరో పది మంది బాధ్యులవుతారన్నారు. ఈ విషయాలను మంథని ప్రాంత ప్రజలంతా గమనించాలన్నారు.