Government lands | కోల్ సిటీ, మే 14: రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ స్థలాలు ఫలహారంగా మారుతున్నాయి. రాజకీయ పలుకుబడి ఉంటే చాలు.. ఖాళీ జాగాలో సాగాలు వేసినా పట్టించుకునే నాథుడే ఉండడు. నగర పాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. కార్పొరేషన్ 5వ డివిజన్ పరిధి మల్కాపూర్‌లో గల సర్వే నం.56, 57లోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు చోద్యం చూడటం పలు అనుమానాలకు తావిస్తున్నది.
సామాన్య ప్రజలు ఇంచు భూమి ఆక్రమించినా ఆగమేఘాల మీద వచ్చి కూల్చివేత చర్యలు చేపడుతారు. అదే కొంతమంది పలుకుబడి గల వ్యక్తులు అప్పనంగా ప్రభుత్వ భూముల్లో పాగాలు వేస్తున్నా అడ్డు చెప్పడం లేదు. కొందరు రేకుల షెడ్లు, మరికొందరు ఏకంగా ఇళ్లు యథేచ్ఛగా నిర్మిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. గతంలో ఇదే సర్వే నంబర్లో వెలిసిన అక్రమ నిర్మాణాలు నగర పాలక అధికారులు యుద్ధ ప్రాతిపదికన కూల్చివేశారు. ఈ ఆక్రమణలపై మాజీ కౌన్సిలర్ మామిడాల చంద్రయ్య స.హ చట్టం ద్వారా వెలుగులోకి తీసుకవచ్చి చర్యలకు న్యాయ పోరాటం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అది ప్రభుత్వ భూమే..
కాగా, 5వ డివిజన్ కు చెందిన మాజీ కౌన్సిలర్ మామిడాల చంద్రయ్య సర్వే నం.56, 57లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై నగర పాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఫిర్యాదు చేయగా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో సమాచార హక్కు చట్టం ద్వారా కార్యాలయంలో మరోసారి దరఖాస్తు సమర్పించగా అధికారులు స్పందించి రామగుండం తాసీల్దార్ కు పంపించారు. రెవెన్యూ అధికారులు పరిశీలించి అది ప్రభుత్వ భూమిగా నే నిర్ధారించారు. దీనితో కార్పొరేషన్ అధికారులు అది ప్రభుత్వ భూమేననీ, అందులో నిర్మాణాలకు తాము అనుమతి ఇవ్వలేదంటూ గత ఏప్రిల్ 16న మామిడాల చంద్రయ్యకు వివరణ పత్రాలు అందజేశారు.
ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేస్తే గానీ వెలుగులోకి రాకపోవడం గమనార్హం. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా.. అధికారుల దృష్టికి రాలేదా..? వచ్చినా.. ప్రభుత్వ భూమే కదా అని మిన్నకుండా ఉన్నారా..? లేక అమ్యామ్యాలు ఏమైనా చేతులు మారాయా? అన్నది తేలాల్సి ఉంది. ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని మాజీ కౌన్సిలర్ చంద్రయ్య రెండు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యేకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఎసీ) అరుణ శ్రీ స్పందించి అక్రమ నిర్మాణాలపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీహరిని వివరణ కోరగా తాను నెల రోజుల క్రితమే బాధ్యతలు స్వీకరించాలని, మరోసారి సమగ్ర దర్యాప్తు చేసి చర్యల నిమిత్తం కమిషనర్ కు నివేదిస్తానని తెలిపారు.