దండేపల్లి, మార్చి14 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట రేంజ్ పరిధిలో ఉచ్చు పెట్టి చిరుతను హతమార్చిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు జన్నారం అటవీ డివిజనల్ అధికారి రామ్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. దండేపల్లి మండలానికి చెందిన కొంతమంది వన్యప్రాణులను చంపి, వ్యాపారం చేస్తున్నారన్న సమాచారం మేరకు శనివారం అటవీశాఖాధికారులు డాగ్ హంటర్‌తో దాడులు నిర్వహించారు. ఊట్ల గ్రామానికి చెందిన మొడితె వెంకటేశ్, శ్రీనివాస్, మామిడిపెల్లికి చెందిన వనపర్తి శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకొని, 13 చిరుతపులి గోర్లు, ఇతర వన్యప్రాణులకు చెందిన అవయవాలను స్వాధీనం చేసుకున్నారు. ఊట్ల శివారులోని అటవీ ప్రాంతంలో వైరుతో చేసిన ఉచ్చులతో చిరుతపులిని చంపి, గోర్లను తొలగించి, మృతదేహాన్ని కాల్చివేసినట్టు దర్యాప్తులో తేలిందని ఎఫ్‌డీవో తెలిపారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరుస్తామని, ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.