అమ్రాబాద్, మార్చి 14 : నల్లమల అడవుల్లో నివసిస్తున్న చెంచుల జీవన ప్రమాణాలు, వారి ఆర్థిక పరిస్థితులపై రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆరా తీశారు. శనివారం కుటుంబ సమేతంగా శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జునస్వామి దర్శన అనంతరం తిరుగు ప్రయాణంలో నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్లోని తెలంగాణ టూరిజం మృగవణి విశ్రాంతి భవనంలో కొద్దిసేపు ఆయన విరామం తీసుకున్నారు.
కలెక్టర్ సంతోష్, డీఎఫ్వో రేవంత్ చంద్రతో కలిసి గవర్నర్కు స్వాగతం పలకగా.. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. గవర్నర్ దత్తత తీసుకున్న చెంచుపెంటల్లో చేపడుతున్న సోలార్ విద్యుత్, తాగునీటి సదుపాయాలు, నిధుల వినియోగం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాల గురించి అధికారులను అడిగి తెలుసుకొన్నారు.
ఏటీఆర్ పరిధిలో ఉన్న సహజ వనరులు, జలపాతాలు, వన్యమృగ సంపద, శైవక్షేత్రాలు, చారిత్రక కట్టడాలు, ఎకో టూరిజం అభివృద్ధి కి ఉన్న అవకాశాలపై కలెక్టర్ వివరించారు. అడవుల సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, వన్యప్రాణుల, టూరిజం డెవలప్మెంట్ ప్రణాళికలను డీఎఫ్వో వివరించారు. అనంతరం పెద్దపులి ఛాయాచిత్రం జ్ఞాపికను గవర్నర్కు అధికారులు అందజేశారు.