పెద్దపల్లి : కాళేశ్వరం ప్రాజెక్టు పై అక్కసుతో గోదావరి నదిని ఎండబెట్టి తెలంగాణ రైతాంగాన్ని నిలువునా ముంచుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, తెలంగాణ ఉద్యమకారుడు బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో చేపట్టిన గోదావరి కన్నీటి గోస మహా పాదయాత్ర మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఉదయం పెద్దపల్లి మండలం బంధంపల్లిలోని స్వరూప గార్డెన్స్‌లో ప్రారంభమైన ఈ మహా పాదయాత్ర రెండవ రోజు 31వ కిలోమీటర్ నుంచి ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తా అంబేద్కర్ చౌక్ చేరుకున్న పాదయాత్రకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అక్కడ నుంచి రైల్వే స్టేషన్ రోడ్ లోని తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఇక్కడి నుంచి ప్రారంభమై అయ్యప్ప ఆలయ చౌరస్తాలో గల తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ పాదయాత్రకు దారి పొడవునా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. కాగా, రెండో రోజు పాదయాత్ర పెద్దపల్లి నుంచి సుల్తానాబాద్, కరీంనగర్ వరకు చేరుకోనుంది