కోల్ సిటీ, సెప్టెంబర్ 4: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విద్యానగర్ బ్రాంచి యూనియన్ బ్యాంకులో కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి జనరల్ ఫిజిషియన్ డా. నాగరాజు హాజరై సుమారు 200 మంది బ్యాంకు ఉద్యోగులు, ఖాతాదారులకు ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ, 2డీ, ఏకో పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. హాస్పిటల్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది, ఖాతాదారులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఈ మెగా శిబిరం నిర్వహించామన్నారు.
కరీంనగర్ మెడికవర్లో పండుగలు, సెలవులతో సంబంధం లేకుండా 24 గంటలు అన్ని రకాల వైద్య సేవలు అందుతాయన్నారు. ప్రస్తుత పరిస్థితిలో అనారోగ్యాలు చెప్పి రావడంలేదని, వయసుతో నిమిత్తం లేకుండా గుండె జబ్బులు విరివిగా వస్తున్నాయని, గుండె సంబంధిత వ్యాధులకు కరీంనగర్ మెడికవర్ దవాఖానలో మెరుగైన అత్యవసర చికిత్స అందుతుందన్నారు. శిబిరంలో బ్యాంకు మేనేజర్ ఎం. నిరంజన్, ఉద్యోగులు, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.