ధర్మారం, మార్చి 9: ధర్మారం మండల కేంద్రంలో హరిణి అనే విద్యార్థిని మధుమేహం(Diabetes) వ్యాధితో బాధపడుతుండగా పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆమె పరిస్థితిని గమనించి ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. ధర్మారం మండల కేంద్రంలో అంబేడ్కర్ చౌరస్తా వద్ద పూలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న మానస అనే మహిళకు ముగ్గురు పిల్లలు. వీరిలో రెండవ సంతానం కూతురు హరిణి. ఆమె ధర్మారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 9వ తరగతి చదువుతుంది. చదువులో ముందుండే హరిణి కి ఐదు సంవత్సరాల వయసులోనే డయాబెటిస్ (షుగర్) వ్యాధి వచ్చింది.
షుగర్ వ్యాధి కంట్రోల్ కోసం ప్రతిరోజు ఇన్సులిన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ఈ మధ్యనే హరిణికి థైరాయిడ్ సమస్య కూడా తోడయింది. దీంతో హరిణి శారీరకంగా ఎదుగుదల కూడా తగ్గిపోయి చిన్న పాప లాగా కనిపిస్తుంది. ముందే రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. హరిణి తండ్రి కూడా అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబ పోషణ అంతా మానస పైనే పడింది. మానస పూలమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ కుటుంబ దీన పరిస్థితి తెలుసుకున్న ధర్మారం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2002-03 విద్యా సంవత్సరంలో టెన్త్ చదివిన విద్యార్థి మిత్ర బృందం శ్రావణ్, మహేష్, శ్రీనివాస్, రాజు తిరుపతి విద్యార్థిని హరిణికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా హరిణి తల్లి మానస సహాయం చేసిన సదరు వ్యక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.