కోల్ సిటీ, మార్చి 7: చేయి చేయి కలుపుదాం..నిరుపేద అమ్మాయి పెళ్లికి సాయం( Financial assistance ) అందిద్దాం అంటూ అభయ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ వెల్ది కవిత పిలుపునిచ్చారు. శుక్రవారం ట్రస్ట్ తరఫున రూ.15 వేల ఆర్థిక సహాయం అందించి స్ఫూర్తిగా నిలిచారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన తాళ్లపల్లి జోగయ్య – జయ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. కూలి పనులు చేసుకుని పిల్లలను చదివించారు. పెద్దమ్మాయి కరుణ ఇంటర్ పూర్తి చేసింది.
ఈనెల 12వ తేదీన యువతి కరుణ వివాహం నిశ్చయమైంది. హైదరాబాద్ఖు చెందిన యువకుడు ఆ అమ్మాయిని ఎలాంటి కట్న కానుకలు లేకుండానే పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. అయితే పెళ్లి ఖర్చులకు చేతిలో చిల్లి గవ్వ లేని పరిస్థితిలో బెంగ పెట్టుకున్న ఆ తల్లిదండ్రుల దీనస్థితి తెలుసుకొని వెల్ది కవిత శుక్రవారం అమ్మాయి తల్లికి 5వేలు, అనిల్ చారి రూ.10 వేలు కలిపి ఆర్థిక సహాయం అందజేశారు. మానవతావాదులు ముందుకు వచ్చి తలా ఒక చేయి వేసి పేదింటి ఆడబిడ్డ పెండ్లికి సహాయం అందించాని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.