మల్లాపూర్ నవంబర్ 4: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన మక్కజొన్న కొనుగోలు కేంద్రంలో సక్రమంగా ధాన్యం కొనుగోలు జరగడంలేదని ఆరోపిస్తూ మంగళవారం రైతులు కేంద్రం ఆవరణలో రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మొక్కలను కేంద్రానికి తీసుకువస్తే, ఇక్కడ మాత్రం వారం రోజులు గడిచిన నిబంధనల పేరిట ఎలాంటి దాన్యం కొనుగోలు జరపడం లేదని ఆరోపించారు.
కనీసం కొనుగోలు కేంద్రంలో మౌలిక వసతులు లేక తమకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఎన్నిసార్లు నిర్వాహకులకు మొరపెట్టుకున్న తమను పట్టించుకునే నాధులే కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి ఆన్లైన్లో పంట నమోదు పేరిట రైతులను తీవ్ర ఇబ్బందులకు ప్రభుత్వం గురి చేయడం సరికాదని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులను శాంతిపజేశారు.