పెద్దపల్లి, ఆగస్టు6: ప్రభుత్వ దవాఖానల్లో అందుతున్న వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యాధికారులకు సూచించారు. కలెక్టరేట్లో బుధవారం వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడారు.
టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ పరిధిలో లక్ష్యాలను నిర్దేశించుకొని లక్షణాలు గల ప్రతి ఒక్కరికీ నిర్ధారణ పరీక్షల నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఎక్కడ డెంగ్యూ, మల్లేరియా కేసు వచ్చినా పరిసర ప్రాంతాల్లోని 50 ఇండ్లకు ఫీవర్ సర్వే నిర్వహించాలన్నారు. జిల్లాలో అధికంగా సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయని, వీటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని అన్నారు. ఔట్ పేషెంట్ సేవలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట తప్పని సరిగా జరగాలని సూచించారు.