Ramagundam Corporation | కోల్ సిటీ, మార్చి 18 : రామగుండం కార్పొరేషన్లో యూజీడీ టెండర్లు, నిర్మాణం పనుల్లో అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగాయన్న ఫిర్యాదులపై ప్రాథమిక దర్యాప్తు మొదలైంది. ఈ మేరకు వరంగల్ రీజియన్ ఆర్డీ షాహిద్ మసూద్ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు రామగుండం కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం నుంచి ఏఈలు బుధవారం బయలుదేరి వెళ్లారు. నగర పాలక సంస్థ కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ సూచనల మేరకు డిప్యూటీ ఈఈ శాంతి స్వరూప్, ఏఈలు ఎండీ ఖాజా జమీల్ అహ్మద్, బీ.చంద్రమౌళి, సయ్యద్ మీర్ అహ్మద్ షోయబ్ లు టెండర్ల నిర్వహణ, పనులకు సంబంధించిన రికార్డులను తీసుకొని వెళ్లారు.
కాగా, స్టాంప్ డ్యూటీ ఫండ్ కు సంబంధించిన రూ.13.7 కోట్ల నిధులను 7 ప్యాకేజీలుగా విభజించి యూజీడీ పనులకు వినియోగించారనీ.. పైగా అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై తక్కువ పర్సెంటీజీలతో కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకున్నారనీ, భూగర్భ డ్రైనేజీ పనుల్లో కూడా నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదంటూ మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు విజిలెన్స్ ఉన్నతాధికారులకు గత డిసెంబర్ 1న ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో విజిలెన్స్ శాఖ ఆదేశానుసారం వరంగల్ ఆర్డీ షాహిద్ మసూద్ ప్రాథమిక విచారణ నిమిత్తం ఈనెల 11న రామగుండం నగర పాలక సంస్థకు నోటీసులు పంపించారు. దీంతో బుధవారం ఆర్డీఎంఏ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరయ్యేందుకు కార్పొరేషన్ ఏఈలు వెళ్లారు. అలాగే ఫిర్యాదుదారు సుమలత రాజుకు సైతం విచారణకు హాజరై తమ వాదనలు వినిపించాలని సమాచారం అందించారు. ఐతే ఇక్కడి అధికారులు, కాంట్రాక్టర్లపై చేసిన ఫిర్యాదులకు వరంగల్‌లో విచారణ చేపట్టడం గమనార్హం.
విచారణకు హాజరయ్యేందుకు వెళ్లిన అధికారుల వద్ద ఆర్డీ అడిగిన దాంట్లో ఏ ఒక్కటైనా లేకపోతే మళ్లీ వాయిదా పడే అవకాశం లేకపోదు. మొత్తానికి యూజీడీ వివాదంపై విచారణ జరుగుతుండటంతో రామగుండం బల్దియాలో చర్చనీయాంశమైంది. కాగా ఇదే వివాదంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ శిఖా గోయెల్‌కు మరో ఫిర్యాదు కూడా వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై వరంగల్ ఆర్డీ షాహిద్ మాసూద్ను వివరణ కోరగా.. ప్రాథమిక విచారణ ప్రక్రియ పూర్తయిందని.. నివేదికలను డీఎంఏకు సమర్పించాక తుది చర్యలకు పరిశీలిస్తారని స్పష్టం చేశారు.
Assembly Elections | అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్
Mallikarjun Kharge: మమ్ముల్ని ప్రేమించారు.. మోదీని పెళ్లి చేసుకున్నారు: మల్లిఖార్జున్ ఖర్గే
TS Assembly | యూరియా యాప్ పేరుతో ప్రభుత్వం రైతులను వేధిస్తోంది : మాజీ మంత్రి వేముల