Drinking water | కోల్ సిటీ, ఏప్రిల్ 23: రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని గోదావరిఖనిలో తాగునీటి సరఫరా బంద్ అయింది. రమేష్ నగర్ వాటర్ ట్యాంకు వద్ద వాల్ చెడిపోవడంతో రెండు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. మరమ్మతులకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు సిబ్బంది చెప్పడంతో స్థానికులు లబోదిబోమంటున్నారు. రమేష్ నగర్, ఎన్టీఆర్ నగర్, ఎల్.బీ నగర్, జవహర్ నగర్, తిలక్ నగర్ తదితర ప్రాంతాలకు రెండు రోజులుగా మిషన్ భగీరథ మంచినీరు నిలిచిపోవడంతో ప్రజలకు తిప్పలవుతుంది.
ఇదిలా ఉండగా నగర పాలక సంస్థ పరిధిలో తాగునీటి సరఫరాకు ఆటంకం కలగవద్దని ఇటీవలనే సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్చార్జి కమిషనర్ సైతం అధికారులను ఆదేశించారు. కానీ, ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ బల్దియా అధికారులు బాధ్యతా రాహిత్యం వల్ల రమేష్ నగర్ ట్యాంకు వద్ద చెడిపోయిన వాల్ కు మరమ్మతులకు నాలుగు రోజులు పడుతుండటంతో అప్పటిదాకా తాగునీటికి ఎట్ల అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అసలే ఎండాకాలం కావడంతో తాగునీటికి, ఇతర అవసరాలకు అరిగోస పడాల్సి వస్తుందని వాపోతున్నారు. ఎండకాలం తాగునీటి గండం తప్పేలా లేదంటూ ఆవేదన చెందుతున్నారు. అటు ఆర్ ఓ వాటర్ ప్లాంట్ లు కూడా మూసివేయడం తో దూప కు ఎక్కడికి పోయేది అంటూ అల్లాడుతున్నారు. అధికారులు స్పందించి తాగునీటి సరఫరా వెంటనే చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై లైన్మెన్ వివరణ కోరగా శుక్రవారం నాటికి తాగునీరు అందే అవకాశం ఉందని తెలిపారు.