పెద్దపల్లి రూరల్ జూన్ 17 : రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను విక్రయించాలి. లేదంటే దుకాణ దారులు, డీలర్ ల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్వవసాయశాఖ అధికారి దోమ ఆది రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణంలోని ఎరువులు పురుగుమందులు విత్తనాల దుకాణాలను సంబధిత వ్వవసాయ శాఖ సహాయ సంచాలకులు, మండల వ్వవసాయశాఖ అధికారితో కలిసి అకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ..డీలర్లు నకిలీ పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు అమ్మకూడదన్నారు.
స్టాక్ బోర్డులు, స్టాక్ రిజిస్టర్లు అన్ని సవ్యంగా కంట్రోల్ ఆర్డర్ ప్రకారం నిర్వహించాలని సూచించారు. రైతులు కోరుకున్న విత్తనరకాలను, ఎరువులు, పురుగు మందులను ఇవ్వాలన్నారు. గడువు ముగిసిన, పురుగు మందులు, విత్తనాలు, ఎరువులను ఎప్పటికప్పుడు వెనక్కి తిరిగి పంపించాలన్నారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అమ్మకూడదన్నారు. రైతులు కూడా ఆర్థిక పరిస్థితులను అధిగమించడానికి వరి పంటలో మధ్య కాలిక రకాలను వేసుకోవాలని సూచించారు.
పంటల సాగు విషయంలో వ్వవసాయశాఖ అధికారుల సూచనలను రైతులు పాటిస్తూ ముందుకు సాగాలని, పంటలకు మోతాదుకు మించి పురుగుమందులు వాడరాదని, అలా చేయడం వల్ల కూడా పంటల దిగుబడిపై ప్రభావం పడి రైతులు నష్టపోయే అవకాశాలున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వ్వవసాయశాఖ సహాయ సంచాలకులు శ్రీనాథ్ , పెద్దపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారిణి కాంతాల అలివేణి తదితరులు పాల్గొన్నారు.