ధర్మారం, నవంబర్ 25 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ప్రైవేట్ దవాఖానలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానల్లో అందించే వైద్య సేవలు, ప్రొటోకాల్ బేస్డ్ ట్రీట్మెంట్, ఫైర్ సేఫ్టీ, బయోమెడికల్ వేస్ట్ మేనేజెంట్ గురించి ఆరా తీశారు. ధర్మారంలోని సాయిరాం హాస్పిటల్, కాస్మోడెంట్ డెంటల్ క్లినిక్లను తనిఖీ చేసి ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా నిర్వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారికి నోటీసులు అందజేస్తామని ఆమె స్పష్టం చేశారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ప్రతి ప్రైవేటు దవాఖాన అల్లోపతి, హోమియో, యునాని, ఆయుర్వేద, డెంటల్, ఫిజియోథెరపీ ఎవరైనా సరే వైద్య ఆరోగ్య శాఖలో తమ వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని ముందస్తుగా అనుమతి తీసుకున్న తర్వాతే నిర్వహించాలని ఆమె నిర్వాహకులకు సూచించారు. ఈ తనిఖీల్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఉప అధికారి డాక్టర్ శ్రీరాములు, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.