గోదావరిఖని, ఏప్రిల్ 16 : సింగరేణి సంస్థ తన 136 సంవత్సరాల సుధీర్ఘ చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గనిని ప్రారంభించుకోవడం సువర్ణ అధ్యాయమని, సింగరేణి సంస్థకే కాకుండా యావత్తు తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లు పేర్కొన్నారు. ఒడిశా రాష్ట్రంలో సింగరేణి చేపట్టిన నైనీ బొగ్గుబ్లాక్‌ను బుధవారం హైదరాబాద్‌లోని ఫూలే ప్రజాభవన్ నుంచి ఆయన వర్చువల్‌గా ప్రారంభించి, శుభాకాంక్షలు తెలిపారు. బొగ్గుబ్లాక్‌ను సింగరేణికి కేటాయించి తొమ్మిది సంవత్సరాలు గడిచినప్పటికీ వివిధ రకాల అనుమతుల్లో జాప్యంతో ప్రారంభానికి నోచుకోలేదన్నారు.
ఒడిశాలో ఈ నైనీ బొగ్గుబ్లాక్ సింగరేణి విస్తరణలో ఒక తొలి అడుగుగా ఆయన అభివర్ణించారు.
ఇక్కడి నుంచి ఇతర రాష్ర్టాలు, దేశాలకు కూడా సింగరేణి విస్తరించనుందని, త్వరలో సింగరేణి గ్లోబల్ కంపెనీగా రూపుదిద్దుకోనుందన్నారు. ఈ బొగ్గుబ్లాక్ ప్రారంభానికి సహకరించిన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి, ఒడిశా ప్రాంత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝుకీ, స్థానిక ఎమ్మెల్యే ఆగస్థీ బెహరాకు, తెలంగాణ ప్రజలందరి తరఫు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, ఓఎస్డీ సురేందర్‌రెడ్డి, సింగరేణి ఈడీ(కోల్ మూమెంట్) సుభానీ, బాగ్గుబ్లాక్ సంస్థ డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, నైనీ బ్లాక్ జీఎం టీ శ్రీనివాసరావు ఉన్నారు.