సుల్తానాబాద్ రూరల్ జూన్ 24 : మూతబడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బుధవారం నుంచి ప్రారంభించాలని జిల్లా విద్యాధికారి మాధవి అధికారులను ఆదేశించారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచరామి గ్రామంలోని సర్కార్ బడిని మంగళవారం జిల్లా విద్యాధికారి మాధవి సందర్శించారు. సర్కార్ బడిలో చేస్తున్న శుభ్రత పనులను పరిశీలించారు. గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. బడిని తిరిగి ప్రారంభిస్తామని తప్పనిసరిగా పిల్లలను సర్కారు బాడికి పంపించాలని కోరారు.
ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పాఠశాలలో చిన్న చిన్న మరమ్మతులు చేయించుకునే వరకు బడికి వచ్చిన పిల్లలను అంగన్వాడీ పాఠశాలలో ఏర్పాటు చేసి విద్య ను బోధించాలని మండల విద్యాధికారి ఆరెపల్లి రాజయ్యను ఆదేశించారు. ప్రస్తుతానికి ఒక ఉపాధ్యాయుని ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే విద్యార్థుల సంఖ్యను బట్టి మరొక ఉపాధ్యాయుని నియమిస్తామని స్పష్టం చేశారు. ఆమె వెంట గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేష్, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.