Peddapalli | పెద్దపల్లి రూరల్ డిసెంబర్ 22 : అడవిలో ఉండాల్సిన దుప్పి(చుక్కల జింక) ఉన్నట్లుండి పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేటలోని ఇండ్లలో దర్శనమివ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గ్రామంలోకి దుప్పి వచ్చిన విషయాన్ని గమనించిన గ్రామస్తులు కొందరు సెల్ఫీలు దిగుతుండగా, అందులో కొందరు అటవీ శాఖ అధాకారులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ హలావత్ మంగీలాల్ , ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సతీశ్ కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రామ్మూర్తి గ్రామానికి చేరుకుని దుప్పి ఆరోగ్య పరిస్థితి, అది వచ్చిన పరిసరాలను చుట్టుపక్కల పరిశీలించారు. దుప్పి ఆరోగ్యంగా ఉందని, ఎలాంటి గాయాలు లేకుండా ఉన్న విషయాన్ని ప్రాథమిక అంచనాకు వచ్చిన అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు అందించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలోని బసంత్ నగర్ జింకల పార్కుకు తరలించారు.
పెద్దపల్లి మండలంలోని గౌరెడ్డిపేటలో ఇండ్లలో దుప్పి(చుక్కల జింక) దర్శనమివ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గత ఐదు రోజుల క్రితమే ఎన్నికలు పూర్తి కావడం, సోమవారమే సర్పంచ్ పాలకవర్గాల ప్రమాణస్వీకారం ఉండడంతో ఎవరైనా వేటగాళ్లు ఎన్నికల విందుల కోసమే దుప్పిని వేటాడే సమయంలో తప్పించుకునే క్రమంలో ఇండ్లలోకి వచ్చిందా..? లేదా యాదృశ్చికంగానే అడవి గుట్ట శివారుల నుంచి పశువులు ఆవుల మందలో దారితప్పి వచ్చి ఇండ్లలోకి ప్రవేశించిందా..? అనే అనేక రకాల గ్రామస్తులు, మేధావులు, రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నారు.