ధర్మారం, నవంబర్ 11 : బాల్య వివాహాలను నిరోధించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మహిళా సాధికారత కేంద్రం పెద్దపల్లి జిల్లా కోఆర్డినేటర్ దయా అరుణ, జెండర్ స్పెషలిస్ట్ జే. సుచరిత అన్నారు. ఈ మేరకు మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లంబాడి తండా (బి)లంబాడి తండా (కె) గ్రామాలలోని అంగన్ వాడీ కేంద్రాలలో బాల్య వివాహ చట్టం- 2006 పై తల్లిదండ్రులకు, గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని అన్నారు.
ఆడపిల్ల వయస్సు 18 సంవత్సరాలు నిండక ముందే వివాహం జరిపిస్తే మానసిక, శారీరక అనర్థాలు సంభవిస్తాయని వారు పేర్కొన్నారు. వారికి జన్మించే పిల్లలు కూడా ఆరోగ్యకరంగా ఉండరని వైకల్యం కలిగి ఉంటారనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని వారు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడపిల్లలకు బాల్య వివాహం చేయరాదని దీనిని అందరూ ముక్తకంఠంతో ఖండించి వయస్సు నిండే వరదాకా వేచి చూడాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ బ్లాండినా, ఉపాధ్యాయులు సునీత, శ్రీనివాస్, అంగన్ వాడీ టీచర్లు స్వాతి, లలిత, ఆశా వర్కర్లు సరస్వతి ,శోభ, తిరుమల, గ్రామపంచాయతీ కార్యదర్శులు కిరణ్ కుమార్, ఏఎన్ఎం కరుణ, నశా ముక్త్ భారత్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల తదితరులు పాల్గొన్నారు.