జూలపల్లి, మార్చి 31: పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల వ్యాప్తంగా సోమవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. జూలపల్లి, కోనరావుపేట, కుమ్మరికుంట, బాలరాజ్ పల్లి, వడ్కాపూర్ పెద్దాపూర్, తేలుకుంట తదితర గ్రామాల్లో పెను గాలులకు మక్క పంటలు నేలకొరిగాయి. మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. చేతికి వచ్చే చివరి దశలో పంటలు చేజారిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పెట్టుబడులు పెట్టి రోజంతా కష్టపడి పంటలు పండించుకుంటే ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతులు దిగులు పడుతున్నారు. ఈ యాసంగిలో మండలంలో 4,300 ఎకరాల్లో రైతులు మక్క పంట సాగు చేసుకున్నారు. గాలి దుమారం పంటలను పొట్టన పెట్టుకోవడంతో ఆర్థికంగా రైతులు నష్టపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు నష్టపోయిన పంటలను అంచనా వేసి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.